హిందూపురంలోని యూటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన హిందూపురం డివిజన్ కమిటీ సమావేశంకు కే. తిప్పన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ. శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా పాత వేతనాలతోనే ఉద్యోగుల నుంచి సేవలు పొందుతున్నారని, వారికి ఇవ్వాల్సిన పీఆర్‌సీ, ఐఆర్ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రూ.32 వేల కనీస వేతనం, సామాజిక భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాశ్వత పనులు చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడం లేదన్నారు. హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాత్రం కోర్టు తీర్పులను అమలు చేశారని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ, ఆశా, మున్సిపల్, పంచాయతీ, ఎంపీడీవో, ఎమ్మార్వో, వెలుగు, ఆర్టీసీ తదితర శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే ఆగస్టు 16న చట్టాలు, రాజకీయ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించి విజయవంతం చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో అంగన్‌వాడీ, స్కూల్, భవన నిర్మాణ, ఆటో, పెయింటర్స్ తదితర రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో లేపాక్షి మండల అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి తిమ్మక్క, హిందూపురం పట్టణ అధ్యక్షుడు గణేష్, కే. గోవిందప్ప, పరిగి మండల అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి రాజమ్మ, నరసింహప్ప, క్యాతంబి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు