పెనుకొండ అభివృద్ధే లక్ష్యం: మంత్రి సవిత

వార్డుల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

పెనుకొండ, జూలై 19 (మీకోసం న్యూస్): పెనుకొండ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత అన్నారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మున్సిపాలిటీ కూటమి నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో విస్తృతంగా చర్చించారు.

మంత్రి మాట్లాడుతూ ప్రతి వార్డు నాయకుడు ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయాలని పిలుపునిచ్చారు.

నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెనుకొండలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. అయితే కొన్ని వార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు ఇంకా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మంత్రి సవిత రూ.100 కోట్లతో ఇంటింటికీ కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి ఇప్పటికే భూమిపూజ చేశామని, పనులు పూర్తయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
మున్సిపాలిటీలో స్ట్రీట్‌లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైల్వే స్టేషన్–కోనాపురం రహదారి, నారాయణమ్మ కాలనీ రోడ్డు వంటి కీలక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని చెప్పారు. సీఎస్‌ఆర్ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలు, పార్కుల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో 1,800 ఇళ్లను మంజూరు చేశామని, అర్హులందరికీ దశలవారీగా గృహాలు అందిస్తామని తెలిపారు. అలాగే 20 ఎకరాల్లో కొత్త లేఅవుట్, రూ.16 కోట్లతో ఎంఐజీ (MIG) లేఅవుట్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, మరిన్ని ప్రభుత్వ, సీఎస్‌ఆర్ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో ప్రజలు చూపిన విశ్వాసాన్ని మరింత అభివృద్ధితో నిలబెట్టుకుంటామని మంత్రి సవిత అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు