తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పి కేరళ కాంగ్రెస్ నేతలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల మేరకు పోలీసులు సైబర్ మోసం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జులై 6న ఎలత్తూర్ ఎమ్మెల్యే విద్యా బాలకృష్ణన్‌కు వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి, తాను ప్రియాంక గాంధీ ఢిల్లీ కార్యాలయంలోని 'రాజ్‌కుమార్'నని పరిచయం చేసుకున్నాడు. త్వరలో కేరళలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందని, మంత్రి పదవి కావాలంటే రూ.3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఇదే తరహా కాల్స్ వడకర ఎంపీ షఫీ పరంబిల్, ఇడుక్కి ఎంపీ డీన్ కురియాకోస్‌లకు కూడా వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై ప్రియాంక గాంధీ వ్యక్తిగత కార్యదర్శి డి.ఎస్. రాజ్‌కుమార్ కేరళ డీజీపీ, వయనాడ్ ఎస్పీలకు అధికారిక ఫిర్యాదు చేశారు. దీంతో కల్పేట సైబర్ పోలీసులు, కోజికోడ్ సైబర్ సెల్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాయి. కాల్స్ ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు, నిందితులు అత్యాధునిక కాలర్ స్పూఫింగ్ సాంకేతికతను ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే పోలీసులను ఆశ్రయించినట్లు ఎమ్మెల్యే విద్యా బాలకృష్ణన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోబోమని మంత్రి టి. సిద్ధిఖీ స్పష్టం చేశారు. మరోవైపు, కేరళలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఖండించారు.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు