అమరావతి, జూలై 16 (మీకోసం న్యూస్): రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూరీ జగన్నాథ రథయాత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ రథం ముందు భాగాన్ని బంగారు చీపురుతో ఊడ్చి సేవ చేసిన సీఎం, అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించిన రథాన్ని తాడుతో లాగి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి. నారాయణ, ప్రజాప్రతినిధులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఇకపై ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. దేశవ్యాప్తంగా అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత భోజన సేవలను ప్రశంసిస్తూ, ఏపీలో రోజూ 1.80 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆధ్యాత్మికతే మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గమని పేర్కొన్న సీఎం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించేందుకు ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం, జగన్నాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
0 కామెంట్‌లు