అమెరికాలో భారతీయ యువతికి అరుదైన గౌరవం 17 ఏళ్ల రిధి చౌహాన్‌కు అత్యున్నత క్యాడెట్ ర్యాంకు


 న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిధి చౌహాన్ అరుదైన ఘనత సాధించింది. న్యూయార్క్‌లోని బెంజమిన్ ఎన్. కార్డోజో హైస్కూల్‌లో నిర్వహిస్తున్న నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ (NJROTC) కార్యక్రమంలో అత్యున్నత 'బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్' హోదాను అందుకుంది. దాదాపు 300 మంది క్యాడెట్లతో కూడిన బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి భారతీయ సంతతి విద్యార్థినిగా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ బాధ్యతల్లో భాగంగా వారానికి నాలుగు రోజులు క్యాడెట్ల డ్రిల్ ప్రాక్టీస్, శిక్షణ, కార్యక్రమాలు, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం 7 గంటలకంటే ముందే పాఠశాలకు చేరుకుని తన విధులను నిర్వర్తిస్తోంది. యూఎస్ నేవీ ఆధ్వర్యంలో నడిచే ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతోంది.

రిధి గతంలో అకడమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ప్లాటూన్ లీడర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించింది. ఆమె నాయకత్వంలో పాఠశాల బృందం వరుసగా రెండేళ్లు జాతీయ స్థాయి లీడర్‌షిప్ అండ్ అకడమిక్ బౌల్ రెండో దశకు అర్హత సాధించింది. అలాగే యూనిట్ కోసం తొలి అండర్‌వాటర్ రోబోట్ నిర్మాణంలోనూ క్యాడెట్లకు మార్గనిర్దేశం చేసింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన రిధి తల్లిదండ్రులు రుచికా చౌహాన్, దిలీప్ చౌహాన్. కుటుంబం అందించిన ప్రోత్సాహం, ఆధ్యాత్మిక విలువలే తన విజయానికి బలమని ఆమె తెలిపింది. భవిష్యత్తులో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరి నేవల్ ఆఫీసర్‌గా దేశసేవ చేయడమే తన లక్ష్యమని వెల్లడించింది.

— మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు