కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి


జూలై 30, 31న కలెక్టరేట్ ముట్టడికి కార్మికులు తరలిరావాలి: సీఐటీయూ పిలుపు

పెనుకొండ, జూలై 18 (మీకోసం న్యూస్): రాష్ట్రంలోని కార్మికులందరికీ నెలకు కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శనివారం పెనుకొండలోని సివిల్ సప్లై కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు, సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సి.ఎస్. శ్రీదేవి, పెనుకొండ పట్టణ కన్వీనర్ బాబావలి, అంగన్‌వాడీ యూనియన్ సెక్టార్ నాయకురాళ్లు శోభారాణి, ప్రమీల, అరుణ, నాగరత్న, రాధమ్మ, పద్మావతి, రాధా, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జి.ఎల్. నరసింహులు మాట్లాడుతూ... రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమలు, గార్మెంట్స్, కియా అనుబంధ పరిశ్రమలు, మున్సిపల్, గ్రామపంచాయతీలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, 104, 108 సిబ్బంది, ఇతర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమంలో భాగంగా జూలై 30, 31 తేదీల్లో సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు భారీ సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

2014 సంవత్సరం నుంచి రాష్ట్రంలో కనీస వేతనాలను ప్రభుత్వం సవరించకపోవడం వల్ల సుమారు 50 లక్షల మంది కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ, దాదాపు 14 సంవత్సరాలుగా ఆ బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల జీవన వ్యయం భారీగా పెరిగిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను వెంటనే సవరించి, కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. జూలై 30, 31 తేదీల్లో జరిగే కలెక్టరేట్ ధర్నాలను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు