మీకోసం, హైదరాబాద్, జూలై 21:
కంటెంట్ ప్రధాన చిత్రాలతో ఆకట్టుకున్న అల్లరి నరేశ్ మరోసారి తన ట్రేడ్‌మార్క్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 65వ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' నుంచి చిత్రబృందం మంగళవారం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో కథానాయికగా నటి సురభి నటిస్తున్నట్లు ప్రకటిస్తూ, 'నా కంటి మీద కునుకే' పాట ప్రోమోను విడుదల చేసింది.
దర్శకుడు చంద్రమోహన్ చింతడ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 'కామెడీ గోస్ కాస్మిక్' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో స్వర్గం, అప్సరసలు వంటి అంశాల నేపథ్యంలో వినోదాత్మక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పూర్తి లిరికల్ సాంగ్‌ను జూలై 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. స్వర్గంలోని మెట్లపై కూర్చున్న అల్లరి నరేశ్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
0 కామెంట్‌లు