మడకశిర, జూలై 26 (మీకోసం న్యూస్):
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనం రేపింది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న సుందరచారి నకిలీ బంగారాన్ని అసలైనదిగా చూపించి బ్యాంకును మోసగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రాథమిక విచారణలో ఏడుగురు ఖాతాదారుల పేర్లపై ఏకంగా 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా సుమారు రూ.71 లక్షల వరకు రుణాలు పొందినట్లు సమాచారం. బ్యాంకు అధికారులు ఇటీవల నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కుంభకోణానికి సంబంధించిన గోల్డ్ లోన్ రికార్డులు, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిసింది. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ అప్రైజర్ సుందరచారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మడకశిర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, బ్యాంకులో గతంలో మంజూరైన గోల్డ్ లోన్లన్నింటినీ అధికారులు మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

0 కామెంట్‌లు