న్యూఢిల్లీ, మీకోసం న్యూస్: పెట్రోల్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం ఇథనాల్ (ఈ20) మిశ్రమాన్ని మరింత పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్‌తో కూడిన ఈ85 ఇంధనం కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టినదేనని, దీన్ని దేశవ్యాప్తంగా ఇథనాల్ శాతం పెంపుగా భావించరాదని స్పష్టం చేశారు.
దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ప్రస్తుతం ఈ20 ఇంధనాన్ని వినియోగిస్తున్నప్పటికీ, ఇథనాల్ కారణంగా ఇంజిన్‌లు దెబ్బతిన్నట్లు లేదా అసాధారణ సమస్యలు తలెత్తినట్లు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ20 ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలకు వారంటీ కొనసాగిస్తున్నాయని తెలిపింది.
అయితే పాత వాహనాల్లో ఈ20 వినియోగం వల్ల ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మెరుగైన దహన ప్రక్రియ, తక్కువ కాలుష్యం, మెరుగైన యాక్సిలరేషన్ వంటి ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించినట్లు తెలిపింది.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు