వైద్యుల కొరతతో జిల్లా ఆసుపత్రిలో రోగుల అవస్థలు ఖాళీ పోస్టుల భర్తీ, సిబ్బంది పెంపునకు ఎస్‌యూసీఐ(సీ) వినతి

హిందూపురం, జూలై 23 (మీకోసం న్యూస్):

హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్‌యూసీఐ(సీ) పార్టీ ఆరోపించింది. 

ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అందజేసింది.
పార్టీ పట్టణ కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సుమారు 700 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేకపోవడంతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదన్నారు. అత్యవసర చికిత్సలు, పరీక్షలు, స్కానింగ్ సేవలు ఆలస్యమవుతున్నాయని, అవసరమైన మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు.

ఓపీ కౌంటర్ మధ్యాహ్నం వరకే పనిచేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళల్లో వచ్చే అత్యవసర కేసులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. కొన్ని అత్యవసర కేసులను అనంతపురం, బెంగళూరుకు రిఫర్ చేయాల్సి వస్తోందని, దీనివల్ల పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకు చీటీలు రాయకుండా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన తహసీల్దారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు అశోక్, మల్లిక్ దత్, స్వప్న, రమేష్‌తో పాటు పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు