వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

అమరావతి, జూలై 11 (మీకోసం న్యూస్): వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విహారయాత్రకు వెళ్లి రాష్ట్రానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఓ మొబైల్ కంపెనీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో 19 మంది ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మిగిలిన 16 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి.

ఘటనపై వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రమాదం నుంచి బయటపడిన వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు కడపకు చెందిన ముడియం శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన గెల్లి జయశ్రీ, హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజగా అధికారులు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు