న్యూఢిల్లీ, జూలై 11 (మీకోసం న్యూస్): ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వాయుసేనల జాబితాలో భారత వాయుసేన (ఐఏఎఫ్) మరోసారి తన సత్తా చాటింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) విడుదల చేసిన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఐదో ఏడాది కూడా చైనాను వెనక్కి నెట్టి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
డబ్ల్యుడీఎంఎంఏ రూపొందించిన 'ట్రూ వాల్యూ రేటింగ్ (TVR)' ప్రకారం భారత వాయుసేనకు 69.4 పాయింట్లు లభించగా, చైనా 63.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా తొలి స్థానంలో, రష్యా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
కేవలం విమానాల సంఖ్యనే కాకుండా వాటి సాంకేతిక సామర్థ్యం, పైలట్ల శిక్షణ, లాజిస్టిక్స్, ఆధునికీకరణ, భవిష్యత్ వ్యూహాలు వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద సుమారు 1,716 విమానాలు ఉండగా, ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సమతుల్య బలం భారత్‌కు ఈ గుర్తింపు తీసుకొచ్చింది.
అయితే, భారత వాయుసేన ముందు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవసరమైన 42 ఫైటర్ స్క్వాడ్రన్లకు బదులుగా ప్రస్తుతం 29 స్క్వాడ్రన్లు మాత్రమే సేవల్లో ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు 180 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు స్వదేశీ రక్షణ తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
మూడో స్థానంలో నిలిచి ప్రపంచ వేదికపై భారత వాయుసేన మరోసారి తన బలాన్ని చాటుకోవడం దేశానికి గర్వకారణంగా మారింది.

0 కామెంట్‌లు