పుట్టపర్తి, జూలై 8: లాడ్జిల్లో బస చేసే ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని పుట్టపర్తి అర్బన్ సీఐ యువరాజు సూచించారు. ఈ విధానం ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సాయి ఆరామంలో లాడ్జి యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. పుట్టపర్తి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
లాడ్జిల్లో బస చేసే ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. విదేశీయులు బస చేసినట్లయితే వారి పూర్తి వివరాలతో కూడిన ఫారం-సీ (Form-C) ను నిబంధనల ప్రకారం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమర్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా లాడ్జిల్లో వ్యభిచారం, పేకాట, మద్యం సేవించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పించరాదని హెచ్చరించారు. ప్రతి లాడ్జిలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన లాడ్జి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో లాడ్జి యజమానులు పోలీసులకు పూర్తి సహకారం అందించి సురక్షితమైన పుట్టపర్తి నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఐ యువరాజు విజ్ఞప్తి చేశారు.

0 కామెంట్‌లు