మీకోసం న్యూస్ ప్రతినిధి
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. వాణిజ్య నౌకపై జరిగిన ఘటన అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల రోజుల్లో ఇరాన్‌పై అమెరికా చేపట్టిన వరుస చర్యల్లో ఇది మరో కీలక పరిణామంగా నిలిచింది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పందిస్తూ, ఇరాన్ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇచ్చామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వర్గాల కథనం ప్రకారం, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య కంటైనర్ నౌకపై ఇరాన్ బలగాలు జోక్యం చేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆ నౌక అనుమతించిన మార్గాన్ని పాటించలేదని, పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతోనే చర్యలు తీసుకున్నామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది.
హర్మూజ్ జలసంధి మూసివేత ప్రకటన
అమెరికా దాడుల అనంతరం హర్మూజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు నౌకల రాకపోకలకు అనుమతి ఉండదని తెలిపింది. అమెరికా నుంచి మరిన్ని దాడులు జరిగితే తమ మిత్రదేశాల సైనిక స్థావరాలపైనా ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తీర ప్రాంతాల్లో పేలుళ్లు
అమెరికా వైమానిక దాడుల తర్వాత హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అంతర్జాతీయ వాణిజ్యం, చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

0 కామెంట్‌లు