విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ – సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టుపై నిరసన
ధర్మవరం, జూలై 20 (మీకోసం న్యూస్): నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని తీవ్రంగా ఖండించాయి.
సోమవారం ధర్మవరం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, ఆర్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌యూ, ఏఐఎస్‌ఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ ఉపాధ్యక్షుడు సాకే హరి, ఏఐఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్, ఏఐఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు రోదం శివకుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎన్‌టీఏ పనితీరు పూర్తిగా విఫలమైందని, లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలను నీట్ పేపర్ లీకేజీ దెబ్బతీసిందన్నారు. ఈ ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత 18 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయనకు ఏదైనా అపాయం జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో ఆందోళనలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అమన్, అమర్ అభినయ్, నగర కార్యదర్శి అఖిలేష్, ఏఐఎస్‌యూ నాయకులు హరిబాబు, కార్తీక్, నాని, నగర నాయకులు నరసింహ, ప్రసాద్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు