రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించాలి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్

అనంతపురం, జూలై 25 (మీకోసం న్యూస్): రాయలసీమ రైతాంగానికి జీవనాధారమైన ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నెల 30న చెన్నకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో రైతుల కోసం నిర్వహించే పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు.

అనంతపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమకు శాశ్వత సాగునీరు అందించాలనే లక్ష్యంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో ప్రాజెక్టును అటకెక్కించి లక్షలాది మంది రైతుల ఆశలను దెబ్బతీసిందని విమర్శించారు. కృష్ణా జలాలపై రాయలసీమకు ఉన్న న్యాయమైన హక్కులను సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులు పరిరక్షించబడే వరకు, రాయలసీమకు సాగునీరు వచ్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం సమన్వయకర్త దీపిక వేణు రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు