తిరుమల, మీకోసం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఆమెకు శ్రీవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఇటీవల పవన్ కల్యాణ్ ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అనంతరం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నా లెజినోవా శ్రీవారిని దర్శించినట్లు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో ఆమె తిరుమల పర్యటన రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
— మీకోసం న్యూస్
0 కామెంట్‌లు