పెనుకొండ దర్గాపేటలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

మంత్రి సవితమ్మ చొరవతో కాలనీలో పబ్లిక్ కొలాయిల ఏర్పాటు

పెనుకొండ, జూలై 18 (మీకోసం న్యూస్): పెనుకొండ పట్టణంలోని దర్గాపేట ప్రాంతంలో ఆర్‌టీసీ బస్టాండ్ పక్కన ఉన్న గోరా మిక్సర్ షెడ్ వెనుక నుంచి షాషావలి ఇంటి వరకు ఉన్న వీధిలో త్రాగునీటి సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. కాలనీ వాసుల విజ్ఞప్తిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే  ఎస్. సవితమ్మ వెంటనే పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ప్రజల అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ త్రాగునీటి కొలాయిలు ఏర్పాటు చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన కొలాయిలను తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. దీంతో ఎన్నో రోజులుగా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వేసవి కాలంతో పాటు సాధారణ రోజుల్లో కూడా తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు తమ ఇంటి సమీపంలోనే స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో ఎంతో సౌకర్యంగా మారిందని కాలనీ మహిళలు, వృద్ధులు తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి సవితమ్మ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. తమ సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం పట్ల ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సవితమ్మ నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వారు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, విద్య, వైద్యం వంటి ప్రతి అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు మంత్రి సవితమ్మ నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని తెలిపారు.
త్రాగునీటి కొలాయిల ఏర్పాటు పూర్తవడంతో స్థానికులు మంత్రి సవితమ్మకు, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదే విధమైన చొరవ కొనసాగాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు