ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం.ఎన్. మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సోమకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. సోమన్న మౌర్యాన్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగేంద్ర, అగళి మండల నాయకులు నరసింహమూర్తి, భరత్ కుమార్, రొళ్ల మండల అధ్యక్షుడు ఓబులప్పతో పాటు పలువురు జిల్లా, మండల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సభలో ముందుగా గ్రామ పెద్దలు, మహిళలు, ఉరుము కళాకారులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాల మహానాడు నూతన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామానికి జిల్లా కమిటీ రావడం ఆనందదాయకమని, ఇటువంటి చైతన్య కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు.
అధ్యక్షత వహించిన నాయకులు మాట్లాడుతూ పల్లె పిలుపు కార్యక్రమం కేవలం సమావేశం మాత్రమే కాదని, ప్రతి గ్రామంలో మాలల ఐక్యతను బలోపేతం చేసే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామాల వారీగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడమే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు ఎం.ఎన్. మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో మాలల ఐక్యత ఆశించిన స్థాయిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఐక్యంగా ఉంటేనే వాటి పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో మాలల మధ్య పరస్పర సహకారం, సంఘటిత భావం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే "మాలల మేలుకొలుపు" కార్యక్రమాన్ని ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నామని వివరించారు.
అగళి మండలం బ్యాడిగిరే గ్రామంలో స్థానిక యువ నాయకుడు భరత్ కుమార్ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామంలోని మాల కుల బాంధవులు, మహిళలు, కళాకారులను ప్రత్యక్షంగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి యువ నాయకత్వం సమాజాభివృద్ధికి ఎంతో అవసరమన్నారు.
కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయని, వాటిని క్రమంగా విడిచిపెట్టి విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచించారు. ముఖ్యంగా బాల్యవివాహాలను పూర్తిగా నిరోధించాలని, బాలబాలికలకు నాణ్యమైన విద్య అందేలా తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని అన్నారు.
ఉరుము కళాకారులు, కొమ్ము కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కళాకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు త్వరలో భారీ కళాకారుల శోభాయాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. సంప్రదాయ కళలను కాపాడుతూ కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడం సంఘం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవల పేద కుటుంబాల్లో మరణాలు సంభవించిన సందర్భాల్లో అంత్యక్రియల ఖర్చులు భరించడం కుటుంబాలకు భారంగా మారుతోందని పేర్కొంటూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేయూత కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు దహన సంస్కారాల నిమిత్తం రూ.2,516 ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను సభలో పాల్గొన్న ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతించారు.
వక్తలు మాలల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా సంఘం కృషి చేస్తుందని, యువత సంఘటితంగా ముందుకు వచ్చి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన సంఘటిత వ్యవస్థ నిర్మించడమే లక్ష్యమని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ బసవరాజు, ఇరుపసముద్రం నరసింహమూర్తి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, యువత, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీ మాల మహానాడు నూతన కమిటీ సభ్యులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

0 కామెంట్‌లు