తక్కువ వర్షాలతోనూ మంచి దిగుబడులకు PMDS విధానం మాగే చెరువులో రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన


 సోమందేపల్లి, జూలై 7:(మీకోసం న్యూస్ )

సోమందేపల్లి మండలంలోని మాగే చెరువు, చల్లపల్లి, సోమందేపల్లి గ్రామాల్లో రైతులకు PMDS (ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్) విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాగే చెరువు గ్రామ రైతు నరసింహప్ప పొలంలో ఈ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

వ్యవసాయ అధికారిణి ఎస్. విజయభారతి మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున PMDS విధానాన్ని అనుసరిస్తే స్వల్ప వర్షాలతోనే పంటలు మొలకెత్తి మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ విధానంలో వర్షాలు పడకముందే పొడి నేలలో 15 నుంచి 21 రకాల విత్తనాలను విత్తడం వల్ల వర్షం కురిసిన వెంటనే అవి మొలకెత్తుతాయని వివరించారు.

అలాగే ఘన, ద్రవ జీవామృతాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తే చీడపీడల బెడద తగ్గి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని, రైతులు ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, మండల వ్యవసాయ అధికారిణి ఎస్. విజయభారతి, ఏపీఓ సోమశేఖర్ రెడ్డి, చల్లపల్లి గ్రామ నాయకుడు రామకృష్ణ, ప్రకృతి వ్యవసాయ మండల ట్రైనర్ మల్లికార్జున, వెంకట్రామిరెడ్డి, శంకరప్ప, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, మూడు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు