మీకోసం న్యూస్,పుట్టపర్తి, ఆగస్టు 17: శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షులు కనుమ దామోదర్ డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భరద్వారాజ్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 61 బీసీ సంక్షేమ హాస్టళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం కేవలం 26 మంది వార్డెన్లు మాత్రమే విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో వార్డెన్‌కు రెండు, మూడు హాస్టళ్ల అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం, హాస్టళ్లలో పరిశుభ్రతను పర్యవేక్షించడం, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా సంబంధిత అంశాలను నిరంతరం గమనించడం వంటి బాధ్యతలు వార్డెన్లపై ఉంటాయని తెలిపారు. అయితే ఒకే వార్డెన్‌కు బహుళ హాస్టళ్ల బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ సేవలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కావడం లేదన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టళ్లపై ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో హాస్టళ్లలో సిబ్బంది కొరత ఉండటం వారి విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని కోరారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టుల వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో సేకరించి, వాటిని అత్యవసర ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఖాళీల వివరాలతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకు సమగ్ర నివేదిక పంపి, పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని నెలల క్రితమే ఖాళీ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారని నాయకులు తెలిపారు. అయితే ఇప్పటికీ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల సమస్య కొనసాగుతోందన్నారు. ఉన్నతాధికారులతో తక్షణమే మాట్లాడి పెండింగ్‌లో ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల తరఫున కోరారు.
ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా భావించి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు భరత్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు