శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి ఐఏఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే
ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి విజ్ఞప్తి
మీకోసం న్యూస్,అనంతపురం ఆగస్ట్ 19: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, శాప్ ఎండీ భరణి ఐఏఎస్‌ను ఆయన కలిశారు.
నియోజకవర్గంలోని యువత, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు మెరుగైన క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఖేలో ఇండియా’ పథకం కింద అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వస్తే స్థానిక యువత, క్రీడాకారులు నిత్య శిక్షణ పొందడంతో పాటు వివిధ స్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అనువైన స్థలాన్ని గుర్తించి మల్టీపర్పస్ ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేసి, ఖేలో ఇండియా పథకం కింద అవసరమైన నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై శాప్ ఛైర్మన్ రవినాయుడు సానుకూలంగా స్పందించారు. మల్టీపర్పస్ ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని క్రీడాకారులకు మరింత మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.
0 కామెంట్‌లు