ఖేడా జిల్లాకు చెందిన మయూర్ చౌహాన్ (11) కుటుంబ సభ్యులతో కలిసి గిర్నార్ కొండను ఎక్కుతుండగా, యాత్ర మార్గంలోని 50వ మెట్టు సమీపంలో పొదల్లో మాటువేసి ఉన్న సింహం ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. బాలుడిని అడవిలోకి లాక్కెళ్లడంతో కుటుంబ సభ్యులు, తోటి యాత్రికులు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గాలింపు చేపట్టి, ఘటన స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో బాలుడి శరీర అవశేషాలను గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో సంచరిస్తున్న మూడు సింహాలను బంధించి సక్కర్‌బాగ్ జూకు తరలించారు. వాటిలో ఒక సింహం బాలుడి శరీర భాగాలను బయటికి కక్కడంతో, అదే దాడికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గిర్నార్ యాత్ర నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం భావ్‌నగర్ జిల్లాలో చిరుత దాడిలో మరో బాలుడు మృతి చెందిన విషయం స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
0 కామెంట్‌లు