ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులకు సన్మానం.. హాజరుకానున్న మంత్రి, కలెక్టర్
పుట్టపర్తి, జూలై 19 (మీకోసం న్యూస్): మార్చి-2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి 'షైనింగ్ స్టార్స్ అవార్డ్స్-2026' కార్యక్రమాన్ని సోమవారం (జూలై 20) ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని మహి శ్రీనివాస గార్డెన్స్ (గోరంట్ల రోడ్డు)లో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) తెలిపారు.
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ప్రతి మండలం నుంచి ఆరుగురు చొప్పున ఓసీ-2, బీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1 విద్యార్థులతో పాటు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు పతకం, ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి (చెక్ రూపంలో) అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎంపికైన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8 గంటలకల్లా నిర్దేశిత డ్రస్ కోడ్‌తో కార్యక్రమ వేదికకు చేరుకోవాలని డీఈవో కృష్ణప్ప విజ్ఞప్తి చేశారు.
— మీకోసం న్యూస్
0 కామెంట్‌లు