హిందూపురం, జూలై 23 (మీకోసం న్యూస్):

మద్యం సేవించి వాహనం నడిపే వారిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా కఠిన చర్యలు చేపడుతున్నారని హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు ఇప్పటికే రూ.10 వేల జరిమానా విధించగా, తాజాగా అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ కె.వి. మహేష్ ఆధ్వర్యంలో చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో చిలమత్తూరుకు చెందిన కె.ఎన్. కుమార్ రాజా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధించింది.

తదనంతరం పోలీసులు మోటార్ వెహికిల్స్ చట్టం సెక్షన్-185 కింద కేసు నమోదు చేసి నివేదికను ఆర్టీఏ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం మోటార్ వెహికిల్స్ యాక్ట్–1988 సెక్షన్ 19(1)(d), (f) మరియు సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్–1989 ప్రకారం అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను జూలై 23 నుంచి అక్టోబర్ 23, 2026 వరకు మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ హిందూపురం ఆర్టీఏ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

డ్రంకెన్ డ్రైవ్‌తో ప్రాణాలకు ముప్పు

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని సీఐ జనార్ధన్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేవలం చట్టవిరుద్ధమే కాకుండా సమాజ భద్రతకు ముప్పుగా మారుతోందన్నారు.

కఠిన చర్యలు కొనసాగుతాయి

డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు వంటి చర్యలు కూడా కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు