సోమందేపల్లి, జూలై 23 (మీకోసం న్యూస్): పెనుకొండ తాలూకా, సోమందేపల్లి మండలం చల్లాపల్లి పంచాయతీ పరిధిలోని కదిరేపల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబ యువకుడు బి. మదన మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.
చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న మదన మోహన్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసి, జాతీయ స్థాయి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) సాధించారు. అనంతరం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది పరిశోధన కొనసాగించారు.
విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎం. గోనా నాయక్ పర్యవేక్షణలో "తెలుగు–కన్నడ వ్యవసాయ సామెతలు: తులనాత్మక పరిశీలన" అనే అంశంపై పరిశోధన విజయవంతంగా పూర్తి చేయడంతో విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది.
వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కుమారుడు డాక్టరేట్ సాధించడం పట్ల తల్లిదండ్రులు బి. రంగారెడ్డి, జయలలితమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రచయితలు, అధ్యాపకులు, సాహిత్యాభిమానులు, గ్రామ పెద్దలు, పలువురు ప్రముఖులు మదన మోహన్ రెడ్డిని అభినందించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువ పరిశోధకుడి ఈ విజయం ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
0 కామెంట్‌లు