ధర్మవరం, జూలై 25 (మీకోసం న్యూస్):

మీకోసం న్యూస్ ప్రతినిధి | ధర్మవరం: ఉద్యమాల ముందు ప్రభుత్వాలు తలవంచక తప్పదని, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయానికి నిదర్శనమని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర అన్నారు.

ధర్మవరం పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఢిల్లీ నుంచి గ్రామాల వరకు విద్యార్థులు, యువజనులు, ప్రజాస్వామ్య శక్తులు చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అధికార అహంకారం ఎంత పెద్దదైనా విద్యార్థి ఉద్యమాల శక్తి ముందు నిలవలేదని వ్యాఖ్యానించారు.

నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని, విద్యను కార్పొరేట్ లాభాలకు తాకట్టు పెట్టే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా పారదర్శకమైన విద్యా విధానాలను అమలు చేయాలని కోరారు.

విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పీఎస్‌యూ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు