సోమందేపల్లి, జూలై 9: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో జూలై 27, 28, 29 తేదీల్లో లేపాక్షి మండల కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సోమందేపల్లి సీపీఐ పార్టీ కార్యాలయంలో శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిక్షణా శిబిరంలో సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, మేధావులు పాల్గొని వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మండల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. శిక్షణా తరగతులను ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ బాలస్వామి, మండల కార్యదర్శి కామ్రేడ్ రాజగోపాల్, మండల కమిటీ నాయకులు శీలా నారాయణస్వామి, గంగరాజు, మల్లేష్, రాజేష్, సహాయ కార్యదర్శి అంజనమ్మ, నూర్జాన్, బేబీ, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు