పెనుకొండ, జూలై 21(మీకోసం న్యూస్ ): మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 30న నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం పెనుకొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల సవరణ జరగాల్సిన గడువు దాటి నాలుగేళ్లు అవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో 2019లో కూడా రెండేళ్ల ఆలస్యంగా వేతనాల పెంపు అమలైందని, అనంతరం 2023 జూలై నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో అన్ని విభాగాల కార్మికులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, జబ్బార్, చలపతి, అశ్వర్థ, హరిణి, మంజుల, ప్రియాంకతో పాటు సీఐటీయూ నాయకుడు నరసింహ పాల్గొన్నారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు