ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలు ఖండనీయం: హెచ్‌ఆర్‌సీసీఐ

పెనుకొండ, జూలై 21 (మీకోసం న్యూస్): ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్షలో పేపర్ లీక్, అవకతవకలు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్, వాటర్ కానన్‌ల వినియోగం, అరెస్టులు చేయడాన్ని హెచ్‌ఆర్‌సీసీఐ (మానవ హక్కుల పరిరక్షణ సంస్థ) శ్రీ సత్యసాయి జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది.

జిల్లా చైర్మన్ డాక్టర్ చెరుకూరి గంగులయ్య మాట్లాడుతూ, విద్యార్థులు, యువత లేవనెత్తుతున్న సమస్యలు న్యాయమైనవేనని అన్నారు. సమస్యలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిరసనకారులపై బలప్రయోగానికి పాల్పడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, అలాంటి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న యువత గొంతును అణచివేయడం సరికాదని, ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌సీసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటకొండ కృష్ణప్ప, దంపెట్ల కొండయ్య, శివన్న, శంకర, రామాంజులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు