బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుగోరంట్ల పోలీసుల హెచ్చరిక.. జూదం నిర్వహించిన వ్యక్తికి రూ.40 వేల జరిమానా

గోరంట్ల, జూలై 25 (మీకోసం న్యూస్): బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోరంట్ల పోలీసులు హెచ్చరించారు. గోరంట్ల మండలం బి.ఎన్. తండాకు చెందిన కిరణ్ నాయక్ గతంలో జూదం నిర్వహిస్తూ పలుమార్లు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

కిరణ్ నాయక్‌పై గోరంట్ల పోలీస్ స్టేషన్‌లో మూడు, చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తరచూ జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ ఏడాది జనవరి 8న గోరంట్ల తహసీల్దార్ (ఎంఆర్‌వో) ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు.

అయితే బైండోవర్ అనంతరం కూడా జూదం నిర్వహిస్తూ మరోసారి పట్టుబడటంతో కేసు నమోదు చేసి, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎంఆర్‌వో ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 24న ఎంఆర్‌వో రూ.40 వేల జరిమానా విధించగా, నిందితుడు జరిమానా చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు.

బైండోవర్ చేసిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయించడమే కాకుండా, అవసరమైతే జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బాండ్ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ చేపడతామని, ఆస్తులు లేకపోతే చట్టం ప్రకారం జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు