రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ లేదు అపోహలు నమ్మొద్దు.. సేవలు యథావిధిగా కొనసాగుతాయి: జిల్లా రిజిస్ట్రార్ జి. కృష్ణకుమారి


పుట్టపర్తి, జూలై 25 (మీకోసం న్యూస్):

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ శాఖను లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరించడం లేదని పుట్టపర్తి జిల్లా రిజిస్ట్రార్ జి. కృష్ణకుమారి స్పష్టం చేశారు.

ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం, సమయపాలనతో కూడిన పారదర్శక సేవలు అందించేందుకు మాత్రమే 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు' ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చట్టబద్ధ అధికారాలు, పత్రాల పరిశీలన, నమోదు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ పూర్తిగా సబ్ రిజిస్ట్రార్ల ఆధీనంలోనే కొనసాగుతాయని వెల్లడించారు.

ప్రజల ఆస్తుల వివరాలు లేదా ప్రభుత్వ డేటాను ఏ ప్రైవేట్ సంస్థకూ బదిలీ చేయడం లేదని, డేటా భద్రతపై వస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల 'పెన్‌డౌన్' కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అపోహలను నమ్మకుండా సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పుట్టపర్తి సత్యసాయి జిల్లా పరిధిలోని బుక్కపట్నం, చిలమత్తూరు, సి.కె.పల్లి, ధర్మవరం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నేరుగా సంప్రదించాలని జిల్లా రిజిస్ట్రార్ సూచించారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు