సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ విజయవంతమైన పర్యటన 50కిపైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు.. ఏపీపై ఆసక్తి వ్యక్తం చేసిన కొరియా దిగ్గజాలు


సియోల్, జూలై 11 (మీకోసం న్యూస్): రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా అధికారిక పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్–కొరియా సంబంధాల బలోపేతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో 50కిపైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

పర్యటనలో ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్, బీఎన్‌కే ఫైనాన్షియల్ తదితర ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన మంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్‌కు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి, కొరియా ప్రాధాన్యతా పరిశ్రమలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. బుసాన్‌లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో 'APEX–Korea' పెట్టుబడిదారుల అనుసంధాన కేంద్రాన్ని ప్రారంభించడం పర్యటనలో మరో కీలక ఘట్టంగా నిలిచింది.

శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియన్ కంపెనీలతో పాటు కొత్త పెట్టుబడిదారులకు కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కియా సంస్థ ఏపీలో సాధించిన విజయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని '3ఎస్' (Speed, Stability, Service) విధానాన్ని వివరించారు.

మంత్రి లోకేష్ వేగవంతమైన పనితీరును ప్రశంసించిన కొరియా ప్రతినిధులు ఆయనకు "పల్లి.. పల్లి మంత్రి" అనే బిరుదు ఇచ్చారు. కొరియన్ భాషలో "పల్లి.. పల్లి" అంటే "త్వరగా.. త్వరగా" అనే అర్థం.

మంత్రి లోకేష్ పర్యటన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు భారత్–కొరియా వాణిజ్య సంబంధాల బలోపేతానికి కొత్త ఊపునిచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు