హైదరాబాద్ (మీకోసం న్యూస్ | ప్రతినిధి |): టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి ఫిల్మ్ ఫెడరేషన్ మధ్యవర్తిత్వంతో తెరపడింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై విధించిన శాశ్వత నిషేధాన్ని ఫెడరేషన్ అధికారికంగా ఎత్తివేసింది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చొరవతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది.
ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దర్శకులు, నిర్మాతల మండలి ప్రతినిధులతో పాటు జానీ మాస్టర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత హాజరయ్యారు. వివాదానికి సంబంధించిన అంశాలపై ఇరువర్గాలు తమ వివరణ ఇవ్వగా, ఫెడరేషన్ సంతృప్తి వ్యక్తం చేసి నిషేధాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జానీ మాస్టర్ మాట్లాడుతూ, ఈ వివాదం వల్ల అనేక మంది డ్యాన్సర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న చిరంజీవికి, సహకరించిన బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి స్వయంగా తనతో పాటు శేఖర్ మాస్టర్‌తో మాట్లాడి సమస్యను అర్థం చేసుకున్నారని, బాలకృష్ణ కూడా ఫోన్ చేసి సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.
డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సభ్యులు చెల్లించే చందాలతోనే అసోసియేషన్ కొనసాగుతోందని, డ్యాన్సర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సమస్య పరిష్కారంలో సహకరించిన చిరంజీవికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ, ఇది అసోసియేషన్ అంతర్గత సమస్య మాత్రమేనని, ఇప్పుడు పూర్తిగా పరిష్కారమైందన్నారు.
రాజీనామా చేసిన సభ్యులంతా తిరిగి అసోసియేషన్‌లో చేరి కలిసి పనిచేస్తారని తెలిపారు. జనరల్ సెక్రటరీపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 26న జరిగే జనరల్ బాడీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇకపై సుమలత నాయకత్వంలోనే డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో యూనియన్‌లో నెలకొన్న వివాదానికి తెరపడినట్లు ఫెడరేషన్ ప్రకటించింది.
– మీకోసం న్యూస్
0 కామెంట్‌లు