మీకోసం న్యూస్:- వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటి మందాకిని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో విహరిస్తున్న ఆమె, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
హిమాచల్ సంప్రదాయ దుస్తులు ధరించి, వీపుపై పూలతో అలంకరించిన సంప్రదాయ బుట్టతో పర్వతాల మధ్య దిగిన ఆమె చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరిగినా ఆమె ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రకృతిపై తనకున్న మమకారాన్ని మందాకిని భావోద్వేగంగా వ్యక్తం చేశారు. కొండలు, పైన్ చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. కొన్ని ప్రయాణాలు అందమైన ప్రదేశాలను చూపించడమే కాకుండా, మనల్ని మనకు మళ్లీ పరిచయం చేస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.
తెలుగు ప్రేక్షకులకు మందాకిని 1986లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వ చిత్రం సింహాసనం ద్వారా బాగా పరిచయమయ్యారు. ఇందులో విషకన్య పాత్రలో ఆమె నటన విశేష ఆదరణ పొందింది. అనంతరం భార్గవరాముడులో నందమూరి బాలకృష్ణ సరసన నటించారు.
హిందీలో రామ్ తేరి గంగా మైలీ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మందాకిని, తర్వాత డాన్స్ డాన్స్, కమాండో, జీతే హై షాన్ సే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ప్రశాంత జీవితం గడుపుతూ, అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో మమేకమవుతున్నారు.
0 కామెంట్‌లు