దురుసుగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలి


తహసీల్దార్‌కు సోమందేపల్లి మండల పాత్రికేయుల వినతి

సోమందేపల్లి, జూలై 18 (మీకోసం న్యూస్): కదిరి రూరల్ సీఐ నాగేంద్ర గాండ్లపెంటకు చెందిన సూర్య దినపత్రిక విలేకరి బాలరాజుతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడటంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమందేపల్లి మండల పాత్రికేయులు తహసీల్దార్ మారుతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం జర్నలిస్టుల బాధ్యత అని పేర్కొన్నారు. అలాంటి పాత్రికేయుడిని విధుల్లో భాగంగా వార్తా సేకరణ చేస్తున్న సమయంలో బెదిరించడం, అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఒక పోలీసు అధికారి చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగి ఉండగా, జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

పత్రికా స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ప్రభుత్వ అధికారికి బాధ్యత అని, పాత్రికేయుల పట్ల బెదిరింపులు లేదా అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, నిజానిజాలను వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు పాత్రికేయులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్తంభమని, పాత్రికేయుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో సీమ వార్త విలేఖరి వాసుదేవ, మనం పట్టణ విలేఖరి శ్రీనివాసులు, మనం రూరల్ విలేఖరి ఆదినారాయణ, వార్త విలేఖరి మహేష్, సూర్య విలేఖరి రవి, ఆంధ్రప్రభ విలేఖరి సుధీర్ రెడ్డి, అనంత కోకిల విలేఖరి నరసింహులు, లీగల్ పాయింట్ విలేఖరి మధు, పెనుకొండ సూర్య విలేఖరి మంజునాథ్ శెట్టి, సోమందేపల్లి   ఎన్ టైమ్స్       విలేకరి  కుమార్,  సూర్య విలేఖరి నారాయణ, అక్షర విలేఖరి శివ, మాదన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సోమందేపల్లి మండలంలోని పాత్రికేయులంతా ఐక్యంగా నిలబడి జర్నలిస్టుల గౌరవం, భద్రతను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి తక్షణ స్పందనతో పాటు న్యాయమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు