అమరావతి రివర్‌ఫ్రంట్‌కు వేగంఅంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రాజధాని.. అమ్యూజ్‌మెంట్, ఎకో టూరిజం పార్కులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి, జూలై 17 (మీకోసం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కృష్ణా నదీ తీరాన రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, పర్యాటకులను ఆకర్షించే భారీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ శుక్రవారం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏడీసీఎల్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో భాగంగా పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్, ప్రకృతి అందాలను ప్రతిబింబించే ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని అభివృద్ధితో పాటు ఈ పర్యాటక ప్రాజెక్టులు కూడా సమాంతరంగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు
 అనుగుణంగా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని, నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే టూరిజం ప్రాజెక్టుల కోసం భూములు పొందిన ప్రైవేట్ సంస్థలు కూడా ఆలస్యం చేయకుండా నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తాజా సమీక్షతో అమరావతి రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులకు మరింత ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు