మంగళగిరి, జూలై 17 (మీకోసం న్యూస్):
"హైదరాబాద్‌ను చూసిన ప్రతిసారీ నాకు అసూయ కలుగుతుంది. అక్కడి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, ఐటీ టవర్లు చూసినప్పుడల్లా అదే కసిగా మారి ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారతదేశంలోనే నంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని మరింత బలపరిచింది" అని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ఆధునిక హంగులతో నిర్మించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకేశ్ అభివృద్ధి, రాజకీయాలు, వ్యక్తిగత ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు.
రైల్వేల్లో విప్లవాత్మక మార్పులు
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని లోకేశ్ కొనియాడారు. ఒకప్పుడు రైళ్లు సమయపాలన పాటించేవి కాదని, బోగీల పరిశుభ్రత కూడా ఆశించిన స్థాయిలో ఉండేది కాదని గుర్తుచేశారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు, కవచ్ భద్రతా సాంకేతికత, పూర్తి విద్యుదీకరణతో భారత రైల్వే వ్యవస్థ కొత్త రూపును సంతరించుకుందని పేర్కొన్నారు.
మంగళగిరికి మరిన్ని రైళ్లు ఆగాలి
మంగళగిరి రైల్వే స్టేషన్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను సభాముఖంగా కోరారు.
అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం
రాజధాని అమరావతి అభివృద్ధికి రోడ్డు, రైలు, విమాన మార్గాల అనుసంధానం అత్యంత కీలకమని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అమరావతి పనులను ప్రస్తుతం వేగంగా పూర్తి చేస్తున్నామని, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమవుతోందని అన్నారు.
91 వేల మెజారిటీ నాకు మరింత బాధ్యత
2019లో ఓటమి తనను నిరుత్సాహపరచలేదని, ఐదేళ్లపాటు ప్రజల మధ్యే ఉంటూ వారి విశ్వాసాన్ని గెలుచుకున్నానని లోకేశ్ చెప్పారు. "5,300 ఓట్లతో ఓడిపోయాను. అదే సంఖ్యకు ఒక సున్నా జోడించి గెలిపించాలని కోరితే, ప్రజలు 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది" అని భావోద్వేగంగా తెలిపారు.
ఎమ్మెల్యే–ఎంపీ సమన్వయంతో అభివృద్ధి
ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పనిచేస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో మంగళగిరి ఉదాహరణగా నిలుస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, భూగర్భ డ్రైనేజీ వంటి పలు ప్రాజెక్టులకు కేంద్ర నిధులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీపై పెద్ద కంపెనీల దృష్టి
రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్, అదానీ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని లోకేశ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.
0 కామెంట్‌లు