ఆత్మకూరులో అభివృద్ధి జోరు.. జూనియర్ కళాశాల భవనాల ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పరిటాల సునీత దర్బార్

ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలో తొలి కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ భవనాన్ని పూర్తి చేసి ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో రూ.2.12 కోట్ల ఏడబ్ల్యూపీ (AWP) నిధులతో నిర్మించిన నూతన కళాశాల భవనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

కళాశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే వసతి గృహం, తరగతి గదులు, భోజనశాలను సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్య, భోజనం, వసతి, భవనాలు.. ప్రతి అంశంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలన్నదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం సోలార్ హీటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించిన సునీత.. జూనియర్ కళాశాల దశలో విద్యార్థులు తప్పుదారి పట్టకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విద్యా సామగ్రిపై రాజకీయ ప్రచారం జరిగిందని విమర్శిస్తూ.. ప్రస్తుతం మహనీయుల చిత్రాలతో విద్యా సామగ్రిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఇక జూలై 22 నుంచి డోనర్ యాప్ ద్వారా పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, దాతల నుంచి పాఠశాలల అభివృద్ధికి విరాళాలు సేకరించే కార్యక్రమం ప్రారంభమవుతుందని, విరాళాలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందని వివరించారు.

అంతకుముందు రూ.56 లక్షల ఎన్‌హెచ్‌ఎం నిధులతో నిర్మించనున్న పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరు మండలంలో గత రెండేళ్లలో సుమారు రూ.60 కోట్లతో రహదారులు, తాగునీటి పథకాలు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ప్రజా దర్బార్‌లో సమస్యలపై స్పందన

అనంతరం ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, కమ్యూనిటీ భవనాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలను ఓపిగ్గా విని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా ప్రతి అర్జీకి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై బాధితులకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.
-మీకోసం న్యూస్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు