వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'లో నారా రోహిత్.. ఫస్ట్ లుక్ విడుదల

మీకోసం న్యూస్ ప్రతినిధి -

హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 (AK47)' చిత్రంలో నటుడు నారా రోహిత్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

నిర్మాణ సంస్థ తమ అధికారిక 'ఎక్స్' వేదికగా.. "డైనమిక్ నారా రోహిత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #AK47 ప్రయాణంలోకి మీకు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొంది. విడుదలైన పోస్టర్‌లో నారా రోహిత్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, ఆయన పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి గత ఏడాది డిసెంబర్‌లో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47' అనే టైటిల్‌ను ప్రకటించారు. అప్పట్లో విడుదలైన టైటిల్ పోస్టర్‌లో వెంకటేశ్ చిరునవ్వుతో రోడ్డుపై నిలబడి కనిపించిన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి.

వెంకటేశ్ ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో విజయాన్ని అందుకోగా, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. గతంలో వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రానికి త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, ఆ సినిమా ఘనవిజయం సాధించింది.

గత ఏడాది ఆగస్టులో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. నారా రోహిత్ చేరికతో ఈ చిత్ర తారాగణం మరింత బలపడిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు