మీకోసం న్యూస్ ప్రతినిధి
ఒకప్పుడు విదేశాలకు వెళ్లే తెలుగు కుటుంబాలు ఇంటి పచ్చళ్లను సూట్‌కేసుల్లో భద్రంగా తీసుకెళ్లేవి. నేడు అదే ఇంటి రుచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన విశ్వసనీయ బ్రాండ్‌గా ప్రియా ఫుడ్స్ నిలిచింది. తెలుగు సంప్రదాయ రుచులను 30కి పైగా దేశాలకు పరిచయం చేసిన ఈ సంస్థ ప్రస్థానం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇటీవల 'ఎక్స్' వేదికగా వైరల్ అయిన ఓ పోస్టు నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి.. అమ్మమ్మ పెట్టిన గోంగూర పచ్చడి జాడీ సూట్‌కేసులో పగిలిపోవడంతో కస్టమ్స్ అధికారులు దాన్ని పారేయడం, ఆ విద్యార్థి కన్నీటి పర్యంతం కావడం ఒక సంఘటనగా పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓ భారతీయ స్టోర్‌లో తాతయ్య తన మనవరాలికి ప్రియా పచ్చడి జాడీని చూపిస్తూ.. "ఇదే మన ఇల్లు" అని చెప్పిన ఘటనను వివరించింది. ఈ రెండు సంఘటనలు ఇంటి రుచికి ఉన్న అనుబంధాన్ని చాటాయి.
ఈ విజయగాథ వెనుక ఉన్న సూత్రధారి మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త చెరుకూరి రామోజీరావు. కృష్ణా జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మార్గదర్శి, ఈనాడు వంటి సంస్థలతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.
అదే దూరదృష్టితో 1980లో ప్రియా ఫుడ్స్ను ప్రారంభించారు. సంప్రదాయ తెలుగు పచ్చళ్లను ఆధునిక ఫుడ్ టెక్నాలజీతో తయారు చేసి, రుచి చెక్కుచెదరకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేలా రూపొందించారు. కేవలం ఆరు రకాల పచ్చళ్లతో ప్రారంభమైన సంస్థ నేడు 200కు పైగా ఉత్పత్తులను తయారు చేస్తోంది. పచ్చళ్లతో పాటు మసాలా పొడులు, వంట పేస్టులు, ఇన్‌స్టంట్ మిక్స్‌లు, రెడీ-టు-ఈట్ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా భారతీయుల వంటగదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
అమెరికా, బ్రిటన్, యూరప్, పశ్చిమాసియా సహా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు ప్రియా ఫుడ్స్ ఇంటి రుచిని అందిస్తోంది. నాణ్యమైన ముడిసరుకులు, సంప్రదాయ రుచిని కాపాడే తయారీ విధానంతో వినియోగదారుల విశ్వాసాన్ని కొనసాగిస్తోంది.
2024 జూన్‌లో రామోజీరావు కన్నుమూసినా, ఆయన ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ నేటికీ అదే విలువలను కొనసాగిస్తోంది. ప్రియా పచ్చడి కేవలం ఒక ఆహార ఉత్పత్తి కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి భావోద్వేగాలను, సొంత ఊరి జ్ఞాపకాలను కలిపే సాంస్కృతిక వారధిగా నిలిచింది.
0 కామెంట్‌లు