పెనుకొండ, జూలై 10 (మీకోసం న్యూస్):
పెనుకొండలోని కియా పరిశ్రమను మరింత విస్తరించి ఎలక్ట్రిక్ (EV), హైబ్రిడ్ వాహనాల తయారీ యూనిట్లతో పాటు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక ముందడుగు వేసిందని పేర్కొన్నారు.
దక్షిణ కొరియాలో కియా సంస్థ ప్రతినిధులు, అక్కడి ప్రభుత్వ మంత్రులతో జరిగిన సమావేశాల్లో కియా పరిశ్రమ విస్తరణ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయని వెల్లడించారు. అలాగే సెమీకండక్టర్లు, డిస్‌ప్లే తయారీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, షిప్ బిల్డింగ్ వంటి ఆధునిక రంగాల్లో పెట్టుబడులపై కూడా చర్చించినట్లు తెలిపారు.
పెనుకొండలో తయారయ్యే వాహనాల ఎగుమతులను మరింత పెంచేందుకు విశాఖపట్నం పోర్టును ప్రత్యేక ఎక్స్‌పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చలు జరగడం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు చొరవతో కియా పరిశ్రమ ఏర్పాటై వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది మందికి పరోక్ష ఉపాధి లభించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కియా విస్తరణతో పాటు కొత్త పరిశ్రమలు వస్తే పెనుకొండ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కియా విస్తరణతో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారీ పరిశ్రమలు, పుట్టపర్తిలో ప్రతిపాదిత విమానయాన రంగ పరిశ్రమలు వంటి ప్రాజెక్టులు జిల్లాకు మరింత అభివృద్ధిని తీసుకువస్తాయని తెలిపారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, యువతకు స్వరాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
దక్షిణ కొరియా పర్యటన ద్వారా కియా విస్తరణకు ఊతమిచ్చిన మంత్రి నారా లోకేష్‌కు, అలాగే పెనుకొండ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి సవితమ్మకు పెనుకొండ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పత్రికా సమావేశం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, కోనాపురం కేశవయ్య, త్రివేంద్ర, బాబుల్ రెడ్డి, రఘువీరా, చంద్రకాంతమ్మ, నారాయణ నాయక్, షౌకత్, ప్రభంజన్ కుమార్, పులుగూర శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, కురబ నంజుండ, ఈశ్వరయ్య, బోయ సోము, అంజేనాయక్, గోపీకృష్ణ, ప్రశాంత్, శ్రీనివాసులు, జనసేన నాయకురాలు శ్రీదేవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు