పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీతో పాటు చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ – ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపు
పెనుకొండ, మీకోసం న్యూస్:
పెనుకొండ పట్టణంలోని ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ కార్మికులు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు చెల్లించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, చెల్లింపు సెలవులు తదితర చట్టబద్ధ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ.. హిందుస్థాన్, భారత్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందిన ప్రైవేట్ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న డెలివరీ కార్మికులు, ఇతర సిబ్బంది ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ షెడ్యూల్‌లోని జీఓ నెం.116, తేదీ 07-12-2007 ప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు నెలకు రూ.12,317కు తగ్గకుండా కనీస వేతనం చెల్లించాలని, రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్యాస్ డెలివరీ కార్మికులు నరసింహ, మారుతి, సత్యనారాయణస్వామి, మురళి, సీఐటీయూ నాయకులు నర్సింహా, రాజు రావు, ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు