అభివృద్ధి–సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు
పెనుకొండ, జూలై 28 (మీకోసం న్యూస్): రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తాను మంత్రి స్థాయికి చేరుకోవడంలో ప్రతి కార్యకర్త కృషి కీలకమని పేర్కొన్న మంత్రి, పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు న్యాయం జరిగేలా అన్ని విధాలుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
2014–19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిందని, అనంతరం గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో నాలుగు లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపించిన మంత్రి, త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. "తల్లికి వందనం" పథకాన్ని కుటుంబంలోని ప్రతి అర్హ విద్యార్థికి వర్తింపజేస్తున్నామని, పెనుకొండ నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలకు కూడా ఈ పథకం అమలు చేసినట్లు పేర్కొన్నారు.
రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులు
పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.2,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, త్వరలో మరో రూ.1,000 కోట్లతో కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లు, రూ.12 కోట్లతో ఎంఓయూ ఐటీఐ కళాశాల, రూ.6 కోట్లతో రొద్దం ఆసుపత్రి, రూ.25 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ప్రతి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి మండల పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ, పంచాయతీ స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీపై విమర్శలు
ఉనికి కోసమే వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ఉనికి కోసమేనని ఆరోపించారు.
ఇంటింటికీ తెలుగుదేశం విజయవంతం చేయాలి
నేటి నుంచి ప్రారంభమైన "ఇంటింటికీ తెలుగుదేశం" (డోర్ టు డోర్) కార్యక్రమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాల్గొనాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 కామెంట్‌లు