అమరావతి, జూలై 20 (మీకోసం న్యూస్): రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తాయని, దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని సీఎం వివరించారు. దీనిని ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలను వివరించి, కొత్త విధానం వల్ల కలిగే ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
సమీక్ష సమావేశంలో పలు సంక్షేమ, పరిపాలనా అంశాలపై కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. దీపం–2.0 పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లింపులు నిర్దిష్ట తేదీల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రజాప్రయోజనం లేని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్న 81 మంది లిటిగెంట్ పిటిషనర్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు సగటున 246 పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పేర్కొంటూ, వారి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రయోజనం ఉన్న ఫిర్యాదులను తప్పకుండా పరిశీలించాలని, దురుద్దేశంతో చేసే ఫిర్యాదులను గుర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది 49 శాతం వర్షపాత లోటు నమోదైందని సీఎం తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ వ్యవసాయ వ్యూహాలు అమలు చేయాలని, రైతులకు అవగాహన కల్పించి మెట్ట పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.
0 కామెంట్‌లు