మీకోసం న్యూస్, పెనుకొండ: ప్రతిష్టాత్మక ప్రెస్టీజ్ ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026లో పెనుకొండ మండల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలానికి కేటాయించిన మొత్తం ఏడు అవార్డుల్లో గ్లోబల్ జెన్ సీబీఎస్‌ఈ స్కూల్ మరియు ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకుని పెనుకొండకు గర్వకారణంగా నిలిచారు.
ఈ అవార్డులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) క్రిష్టప్పల చేతుల మీదుగా విద్యార్థులు అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధికారులు అభినందిస్తూ, విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల అంకితభావం, పాఠశాల యాజమాన్యం అందించిన ప్రోత్సాహమే ఈ విజయానికి కారణమని పాఠశాల ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ విజయంతో గ్లోబల్ జెన్ సీబీఎస్‌ఈ స్కూల్, ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పెనుకొండ విద్యారంగానికి ఈ అవార్డులు మరింత ప్రతిష్ఠను తీసుకొచ్చాయని పలువురు అభిప్రాయపడ్డారు.
0 కామెంట్‌లు