విద్యార్థులకు సీఎం విజయ్ సత్కారం.. టీవీకే విద్యా పురస్కారాలు

చెన్నై, జూలై 12: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా విద్యా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. 10వ, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన స్వయంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం జూలై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారంలో చెన్నైలో నిర్వహించే అవకాశం ఉంది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో అత్యుత్తమ మార్కులు సాధించిన తొలి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు, ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న తొలి విద్యా పురస్కారాల కార్యక్రమం ఇదే కావడం విశేషం. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ వేదికపై ఈ కార్యక్రమం జరిగే అవకాశముండగా, అర్హులైన విద్యార్థుల ఎంపిక, ఆహ్వాన బాధ్యతలను జిల్లా కార్యదర్శులకు పార్టీ అప్పగించింది.

ఎన్నికల అనంతరం ఈ కార్యక్రమం నిలిచిపోతుందనే ప్రచారం జరిగినప్పటికీ, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, టీవీకే పార్టీ ఆధ్వర్యంలో వ్యక్తిగత చొరవతో నిర్వహించే కార్యక్రమమేనని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమానికి సంబంధించిన తేదీ, వేదిక వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

మీకోసం న్యూస్
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు