ఏఐఎస్ఎఫ్ ధర్నా.. ఏఎస్‌డబ్ల్యూఓకు వినతిపత్రం
హిందూపురం, జూలై 20 (మీకోసం న్యూస్):
హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ కళాశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ.. హిందూపురంలోని బీసీ, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడం విచారకరమన్నారు. అద్దె భవనాల్లో విద్యార్థినులు ఉండాల్సి రావడంతో భద్రతతో పాటు చదువుపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ బాలుర కళాశాల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందన్నారు. ఎలాంటి ప్రమాదం సంభవించకముందే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ముక్కడిపేటలోని బీసీ బాలుర హాస్టల్‌కు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, వెంటనే రక్షణ గోడ నిర్మించాలని కోరారు.
హాస్టల్ విద్యార్థులకు అవసరమైన బెడ్‌లు, బెడ్‌షీట్లు, ట్రంకు పెట్టెలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందించాలన్నారు.
0 కామెంట్‌లు