మంగళగిరి, జూలై 13 (మీకోసం న్యూస్): ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం సముద్రంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాయని చెప్పారు. ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 72 గంటల పాటు విస్తృతంగా గాలించినప్పటికీ మిగతా ఆరుగురి ఆచూకీ లభించలేదన్నారు.
కోస్ట్‌గార్డ్, త్రీ-మెన్ కమిటీ నివేదికల ఆధారంగా వారు మృతిచెందినట్లు నిర్ధారించి, బాధిత కుటుంబాలకు 72 గంటల్లోనే రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఇంత వేగంగా ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
ఈ విషాద ఘటనను కూడా జగన్ రాజకీయాలకు ఉపయోగించుకోవడం దురదృష్టకరమని కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో విశాఖ హార్బర్‌లో 45 పడవలు అగ్నికి ఆహుతైనప్పుడు బాధితులను పరామర్శించని జగన్ ఇప్పుడు పరామర్శల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
జగన్ పాలనలో సముద్రంలో గల్లంతైన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా అందించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు రూ.3.15 కోట్ల ఆర్థిక సాయం అందించామని చెప్పారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, వేట నిషేధ భృతిని రూ.20 వేలకి పెంచి రూ.258 కోట్లకు పైగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.217ను రద్దు చేసి మత్స్యకారుల చెరువుల హక్కులను కాపాడామని చెప్పారు.
మత్స్యకారుల భద్రత కోసం 4,560 శాటిలైట్ ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను సహించబోమని హెచ్చరిస్తూ, మత్స్యకారులకు ఐదేళ్లలో ఏం చేశారో చర్చకు రావాలని జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు.
-మీకోసం న్యూస్

0 కామెంట్‌లు