బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బాండ్ ఉల్లంఘించిన వారిపై జరిమానా, డిటెన్షన్, జైలు శిక్ష తప్పదన్న అదనపు ఎస్పీ

హిందూపురం: ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు హిందూపూర్ అదనపు ఎస్పీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె.వి. మహేష్ పర్యవేక్షణలో హిందూపురం సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో బైండోవర్ అయిన వ్యక్తులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

బైండోవర్ చేసిన వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా స్వీయ భద్రతా బాండ్లు అమలు చేయిస్తున్నామని, నిర్దిష్ట కాలం పాటు మంచి ప్రవర్తనతో ఉండాలని షరతులు విధిస్తున్నామని తెలిపారు. అయితే కొందరు బాండ్ నిబంధనలు ఉల్లంఘించి భూ వివాదాలు, గొడవలు, జూదం, మట్కా, పేకాట, బెట్టింగ్, అక్రమ మద్యం విక్రయాలు, బెదిరింపులు, దాడులు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

ఇలాంటి వారిపై సంబంధిత నేరాల కింద కేసులు నమోదు చేయడంతో పాటు, బాండ్ ఉల్లంఘన విషయాన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహశీల్దార్లకు నివేదించి బాండ్ ఫోర్ఫీచర్, భారీ జరిమానా, డిటెన్షన్, జ్యుడీషియల్ రిమాండ్ వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి

జూదం, మట్కా, బెట్టింగ్, అక్రమ మద్యం, గొడవలు, బెదిరింపులు లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ కోరారు.

"బైండోవర్ అనేది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. బాండ్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టప్రకారం ఫోర్ఫీచర్, జరిమానా, డిటెన్షన్, అవసరమైతే జైలుకు తరలించే చర్యలు తప్పవు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరినీ ఉపేక్షించం." అని హిందూపూర్ అదనపు ఎస్పీ హెచ్చరించారు.

-మీకోసం న్యూస్ | ప్రతినిధి |

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు